Saturday, February 11, 2012

చదువుల వ్యాపారం - యువత : 64 సంవత్సరాల మన స్వతంత్ర భారతం -3

 

ఆగస్టు 15 నాడు 'లైవ్ ఇండియా' టివి చానెల్ లో ప్రసారమైన అంశాల ఆధారంగా 


మనదేశం 4.06 ట్రిలియన్ డాలర్ల జిడిపితో అమెరికా, చైనా వంటి అగ్ర రాజ్యాల జిడిపితో పోటీపడే విధంగా ఉంది. అలాగే సంవత్సరానికి 7, 8 శాతం అభివృద్ధితో అగ్రదేశాల  జిడిపిని కూడా అధిగమించడం కష్టమైన విషయమేమీ కాదు. చాలామంది ఆర్ధిక వేత్తలు  జిడిపి కొలతలు చూసి మనలను మార్కెట్ లా చూస్తున్నారు. కాని నిత్య అవసరాల అభివృద్ధి తక్షణ అవసరమున్న సమాజంగా చూడకపోవడం శోచనీయం.

ఒక వైపున కే.పి.సింగ్, డి.ఎల్.ఎఫ్.చైర్మన్ లాంటి వారు తమ పుట్టినరోజును వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి జరుపుకుంటున్న వారిని, మరోవైపు ఇల్లు, తిండి లేక బాధలు పడుతూ కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారిని చూస్తున్నాం. స్వాతంత్ర్యం తరువాత మన దేశాన్ని దోచుకుతినే మేధావులను తయారు చేశామే కాని, మాతృదేశ ఉన్నతి గురించి తపించి పని చేయగల యువకులను తయారు చేయడంలో వెనుకపడే ఉన్నాం.


ఒకప్రక్క సత్యం రామలింగరాజు, హర్షద్ మెహతా, రాజా, గాలి వంటి బాగా చదువుకొన్నవారు కోట్లకు పైగా కుంభకోణాలు చేస్తూ, తప్పుడు పద్ధతులతో సాటి ప్రజలను మోసం చేసేందుకు తమ తెలివి తేటలను వాడుకొన్న ఉదాహరణలు, మరోప్రక్క దారిలో దొరికిన లక్షల రూపాయలను చదువురాని సామాన్యులు నిజాయితీతో అప్పగించిన సందర్భాలు చూస్తే, మన చదువులు సామాజిక సంస్కారాలనివ్వడంలో విఫలమయ్యాయని అర్ధమౌతోంది. 


1950లో తయారైన భారతదేశం యొక్క ఉన్నత విద్య విధానం వలన ముఖ్యంగా టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో, ఐఐటి సృష్టి,  ఐఐఎమ్ లు, సైన్సు పా
శాలలు, ఆధునిక శిక్షణ మరియు పరిశోధనా సంస్థలు మన దేశంలో మంచి ఫలితాల నిచ్చాయి. స్వాతంత్ర్యం తరువాత ఇప్పటివరకు 1,40,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు చదువుకొని బయటికి రాగా, వారిలో ఇప్పటివరకు 55,000 కు పైగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళారు. వీరి వలన అమెరికా మార్కెట్ మూలధనీకరణలో $80 బిలియన్ సృష్టించే క్రెడిట్ ని పొందినట్లు అంచనా. ఇలా మన దేశంలో తయారయిన మేధావులు ప్రపంచ మానవాళికి ఉపయోగపడటం సంతోషమైనా, వందల కోట్ల ప్రజల కడగండ్లు తీర్చడానికి ఈ మేధస్సు వినియోగించి ఉంటే భారతం బాగుపడేదని మేధోవలసలను గమనించిన వారి అంచనా. కంప్యూటర్ వల్ల ప్రపంచానికి మన శక్తియుక్తులు తెలిశాయి. భారతీయులంటే లేచి గౌరవమిచ్చే స్థాయికి ఈ అరవై నాలుగు ఏళ్ళలో మనం చేరుకున్నాం. మనం సాఫ్ట్ వేర్ లో అభివృద్ధి చెందామంటున్నా, టీసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి అవుట్ సోర్సింగ్ కంపెనీలు డాలర్ల రేట్లలో తేడాల ఆధారంగా నడిపే వ్యాపారమే మనకు గొప్పగా కనిపించడం శోచనీయం. మైక్రోసాఫ్ట్, హ్యూలెట్ ప్యాకార్డ్, యాహూ, గూగుల్, ఫేస్ బుక్ వంటి అనేక కంపెనీలు యూనివర్శిటీ విద్యార్ధులచే స్థాపించబడి నేడు గొప్పగా నడుపబడుతున్నాయి. కాని మనదేశ యువకులలో ఇటువంటి కంపెనీలను స్థాపించగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో మన విద్యావ్యవస్థ విఫలమైంది. ఇప్పటికీ డిగ్రీ చేతికొచ్చాక నేను ఉద్యోగం సంపాదించగలను అని ధైర్యంగా చెప్పే యువత ఇరవై శాతం మాత్రమే ఉండడం బాధాకరం. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశంగా చెప్పుకొంటున్న మనదేశంలోని యువకులు ప్రతిరోజూ ఆత్మహత్యలకు పాల్పడడం ఇందుకు నిదర్శనం. 

సాఫ్ట్ వేర్ తో పాటుగా, ఆయుర్వేదాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేసి, సనాతన విలువలను ప్రపంచానికి కొత్తకోణంలో ఆవిష్కరించేందుకు వేలమంది యువకులు ప్రయత్నాలు చేయడం ఈ అరవై నాలుగు ఏళ్ళలో కలిగిన పెద్ద మార్పు.


సెక్యులరిజం పేరుతో విద్యలో జీవిత విలువలను పెంపొందించే భగవద్గీతను, అనేక ధార్మిక గ్రంథాలను మన యువకులకు పరిచయం చేయకపోవడం ఒక లోపంగా నేటి మానసిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. క్రికెట్ లో బెట్టింగ్ లు, టీట్వంటీని వ్యాపారంగా మార్చడం, అలాగే కబడ్డీ, ఫుట్ బాల్ వంటి జట్టుగా ఆడే ఆటలను మనం మరచిపోవడం అనే స్థితికి ఈ 64 ఏళ్ళ స్వతంత్ర పాలన ఉపయోగపడింది.


జగద్గురువుగా మన్ననలందుకున్న మన దేశం చదువులకోసం విదేశాలపై ఆధారపడడం మరో క్రొత్త ప్రామాణికత. మన యువత పాలకులు తమకు దూరం చేసిన స్వప్నాలను, నిజాలను నెమ్మదిగా తెలుసుకొంటున్నారు. వారు త్వరలోనే తమ లక్ష్యం చేరుకొంటారని ఆశిద్దాం.

స్వేచ్చానువాదం - జి.ఎల్.యెన్. 

http://www.lokahitham.net/2011/12/64-3.html

No comments:

Post a Comment